Thursday, July 19, 2018

కామ సమయం !! - Vatsayana Kamasutralu




పశు, పక్ష్యాదులకు ఏ ఉపాయమూ తెలియదు. మనుషుల్లా బట్ట కట్టుకుని మానాన్ని కాపాడుకోడం లాంటివి కూడా వాటికి లేవు. ఆయా ఋతుకాలాలలో మాత్రమే అవి సంభోగిస్తూ వుంటాయి. పరిమితమైన రతితోటే అవి తృప్తిపడుతూ వుంటాయి. ఎప్పుడు బడితే అప్పుడు సంభోగించాలన్న కోరిక వాటికి వుండడు. కాబట్టే ఉపాయం తెలియకపోయినా అవి కామ సుఖాన్ని అనుభవిస్తూ వున్నాయి. మరి మనుష్యులంటారా? అలా కాదు. ఈ కాలం, ఆ కాలం అని విచక్షణ లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు, కామసుఖాలకోసం పరితపిస్తూ వుంటారు.  సంతానం కోసం ఋతుసమయాల్లోనూ, స్త్రీలను సంతోషపెట్టడం కోసం ఇతర సమయాల్లో కామకేళీ విలాసాలలో మునిగితేలుతూ వుంటారు.




పశుపక్షాదులు ధర్మం కోసం, లేదా అర్థం కోసం, లేదా వంశవృద్ధికి మూలమైన సంతానం కోసం బుద్ధి పూర్వకంగా సంభోగించవు మరి, మానవులది బుద్ధి పూర్వకమైన కామసుఖం. అందువల్ల వీరికి కామశాస్త్రం అన్నివిధాలా అవసరం అవుతున్నది అంతేకాదు అందరూ రతి క్రీడ సలుపుతారు. ఏదో గ్రుడెద్దు చేలో పడ్డట్టు! కాని, ఈ శాస్త్రం చదివినవాళ్ళు స్త్రీలను పురుషులూ, పురుషులను స్త్రీలూ ఎక్కువగా సంతోష పెట్టగలుగుతారు. కారణం ఏమంటే అందుకు అవసరమైన ప్రత్యేక విషయాలు, మెళకువలు అనేకం ఈ శాస్త్రం చదవడం వల్ల తెలుస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్యం కాపాడు కుంటూ, మరోవైపు ఒక క్రమ పద్ధతిలో శాస్త్ర విజ్ఞానం అనే వెలుగులో కామ సుఖం అనుభవించ డానికి వీలవుతుంది.అసలు ఈ ధర్మార్థ కామాలు అనేవి అవసరమా, కాదా అన్నది ప్రశ్న. యజ్ఞయాగాదుల వల్ల కలిగే ఫలం ఈ జన్మలో లభించదు. మరో జన్మలోనే వీటి ఫలితం. కాబట్టి అవి అలౌకికాలు. వ్యవసాయం మొదలైన వాటిలాగా, అప్పటికప్పుడే కాకుండా ఎప్పుడో ఫలితం ఇచ్చే ఈ ధర్మాన్ని అనుష్టించడం అనవసరం అని కొందరి వాదం.


ముందెప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలుసు? ఎంతో కష్టపడి బ్రహ్మచర్యం, తపస్సు మొదలైనవి ఆచరిస్తే మాత్రం ఫలితం వుందో లేదో నిర్థారణగా ఎవరు చెప్పగలరు? ఇలా సందేహాలతో కూడిన ధర్మం కోసం ప్రాకులాడడం వ్యర్థం కదూ! బుద్ధి గలవాడెవడైనా చేతికి చిక్కిందాన్ని ఇతరులకు కట్టబెట్టి ఊరుకుంటాడా? ఎప్పుడో పుణ్యమో, సుఖమో లభిస్తుందని ఈ లోకంలో చేతికి అందిన సుఖాలను జారవిడుచుకోడం అవివేకం కాదా? రేపు లభించే నెమలి కన్నా ఈ రోజు దొరికిన పావురం మేలు అంటే రేపటి పరలోక సుఖం కన్నా ఈనాటి ఇహలోక సౌక్యం మేలు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ వుంది ... వెనుకటికి ఒకాయన యాచన కోసం ఒక పెద్దమనిషి దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ నా వద్ద అంత ధనం లేదు. ఒక కార్షాపణం మాత్రం వుంది. (పదహారు పణాల ఎత్తు నాణెం) అది తీసుకో, లేదా రేపురా, నాకు కొంత ధనం వస్తుంది అప్పుడు నీకు ఒక్క నిష్కం వరకూ (నిష్కం అంటే మాడ ఎత్తు బంగారు నాణెం) ముట్టచెపుతాను అన్నాట్ట ఆ పెద్దమనిషి. అప్పుడా యాచకుడు బాగా ఆలోచించాడు. రేపు ఆ నిష్కం వస్తుందో రాదో అనుకుని, ఆ ఇచ్చినదాన్నే పుచ్చుకుని చక్కా పోయాట్ట.


ఇదంతా ధర్మంతో పనిలేదని చెపుతూ ధర్మాన్ని ఆక్షేపించే వారి వాదం. అయితే, ఈ వాదాన్ని ఖండించి, ధర్మం ముమ్మాటికీ అవసరమే అని అంటున్నాడు వాత్స్యాయనుడు. శాస్త్రాన్ని ఎప్పుడూ శంకించకూడదు. చేతబడులు, ప్రయోగాలు మొదలైన అభిచార కర్మలున్నాయి. అవి శుభం చేకూర్చేవి. ఈ కర్మలకు వాటి వాటి ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తూనే వున్నాయి. సూర్యచంద్రులూ, గృహ నక్షత్ర తారకలూ ఈ ఖగోళం యావత్తూ క్రమమ తప్పకుండా ప్రకాశిస్తూ వుంది కదా! ఎవరు చెబితే అది ఈ పని చేస్తున్నదంటారు? లోకం కోసం అది బుద్ధి పూర్వకంగానే ఇలా ప్రకాశిస్తూ వున్నట్టు కనిపిస్తుంది. వర్ణాశ్రమాలూ, ఆచార వ్యవహారాలూ, లోక యాత్రా వీటన్నిటికీ ఉనికి మాత్రమే స్వరూపంగా గ్రహించినట్టు తోస్తుంది. అందుచేత ధర్మం దేనికని ప్రశ్నించడం అవివేకమే అవుతుంది. ఎప్పుడో వచ్చే పంటకోసం, మనం మన చేతుల్లో వున్న విత్తనాలను ముందే వెచ్చిస్తున్నాం, కాబట్టి రానున్న ఫలితాలకోసం ఇప్పుడే ధర్మాన్ని ఆచరించి తీరాలని అంటాడు వాత్స్యాయనుడు.


ధర్మాచరణ అనవసరం అనేవారి వాదం ఎలా వుంటుందో పైన పేర్కొని ఇక్కడ దానికి సమాధానం చెపుతున్నాడు వాత్స్యాయనుడు. అలాగే అర్థాన్ని (ధనాన్ని) సంపాదించడానికి ప్రయత్నం అక్కర్లేదు. దానికోసం ఉపాయాలు వేదకవలసిన పనిలేదు. అనే వాదాన్ని కూడా పూర్వ పక్షం చేస్తున్నాడు. పట్టుదలతో, ఎన్నో ఉపాయాలు వెదికి, వాటిని ప్రయోగించినా ఒక్కొక్కప్పుడు ధనం లభించకపోవడం మనం లోకములో చూస్తూనే వున్నాము. ఒకవేళ లభించినా, అది కాలమహిమే కాని, అందులో నీ ప్రయోజకత్వం ఏమీ లేదు. అంటే, నీ ఉపాయం వల్ల ఆ ధనం రాలేదన్న మాట. ఉపాయంతో పనిలేకుండానే ఒక్కొక్కప్పుడు ధనం లభిస్తున్నప్పుడు ఇక అర్థశాస్త్రం దేనికి? అనవసరమే కదా! మరి, లోకములో ధనం లభించడం, లభించక పోవడం అనేవి ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తే, అదంతా కాలమహిమేనని సమాధానం చెప్పవలసి వుంటుంది. 


కాబట్టి ప్రతి మానవుడూ కాలాధీనుడు. ఆ కాలానికి మరో పేరు దైవం (కాలోస్మీ లోక క్షయకృత్ప్రవృద్ధో అన్నాడు కృష్ణ భగవానుడు గీతలో. అంటే లోకక్షయం కోసం వృద్ధిపొందిన కాలమూర్తిని నేను అని చెప్పాడు. అలాగే ఖగోళ, జ్యోతిశ్శాస్త్రాలలో మేషాది పన్నెండు రాశులూ కాలపురుషుడి అవయవాలుగా పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. కాలం శివస్వరూపం అన్నారు కొందరు. అందువల్ల కాలం దైవమనే భావం ఏర్పడింది) దైవాధీనం జగత్సర్వమ్ అని కదా ఆర్యోక్తి. దీన్నే కాలవాదం అంటారు.


జగత్తు అంతటికీ కాలమే ఆధారం. ప్రపంచాన్ని సృష్టించేదీ, పోషించేదీ, చివరకు నాశనం చేసేదీ కాలమే. పురుష ప్రయత్నం వల్ల జరగనివి ఎన్నో వుంటున్నాయి. ఇదీ కాలవాదుల సిద్ధాంతం. మానవుడు ఒకప్పుడు ధనవంతుడవుతాడు. ఒకప్పుడు సర్వం పోగొట్టుకొని దారిద్ర్యం అనుభవిస్తాడు. ఒకప్పుడు కార్యాల్లో జయం కలుగుతుంది. మరొకప్పుడు అపజయం సంభవిస్తుంది. ఒకప్పుడు సుఖం, వేరోకప్పుడు కష్టం. ఇదంతా కాలప్రభావమే కాని ఇంకొకటి కాదు. ఇదీ కాలవాదుల వాదం. బలి చక్రవర్తి కుత్సితస్వభావుడైనా కాల ప్రభావం వల్ల ఇంద్రపదవి అలంకరించాడు. మళ్ళీ ఆ కాలమే అతన్ని పదవీ భ్రష్టుణ్ణి చేసింది. కాలం అనుకూలిస్తే తిరిగి అతను ఇంద్రుడు కావచ్చు. కాబట్టి కాలమే అన్నిటికీ మూలం.

Subscribe to get more videos :